శ్రీహరికొట: దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి రెడీగా ఉంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌కు విక్రమ్-ఎస్ అని నామరకణం చేశారు. కాగా, దీనిని ఈ నెల 12నే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో శాస్త్రవేత్తలు వాయిదావేస్తూ వస్తున్నాయి. అయితే నవంబర్ 18న ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించాలని తాజాగా నిర్ణయించారు.
ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లనుంది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించనుంది.