అమరావతి : జీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు రాకెట్ జీఎస్ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనున్నారు.
ఇందుకు కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగా సాగి ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. యూకే దేశంతో 108 ఉపగ్రహాల ఒప్పందంలో భాగంగా తొలి విడతలో 36 ఉపగ్రహాలతో జీఎస్ఎల్వీ మార్క్ – 3 ప్రయోగిస్తున్నామని చెప్పారు. 5,200 కిలోల బరువు కలిగిన ఈ 36 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని వివరించారు.
రాకెట్ భూమి నుంచి ఎగిరిన అనంతరం 16.21 నిమిషాల్లో 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడుతుందన్నారు. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటారని చెప్పారు. 36 ఉపగ్రహాలు పూర్తిగా కమ్యూనికేషన్స్‌కు సంబంధించినవే అని అన్నారు. ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగాలు చేపడతామన్నారు. 2023 మార్చిలోపు మరో నాలుగు ప్రయోగాలు చేపట్టనున్నట్లు సోమనాథ్ వెల్లడించారు.