AP News | ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విజయసాయి రెడ్డి పలు సందేహాలు వెలిబుచ్చారు.
ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా? ర్టీలో ప్రభుత్వంలో సర్వం తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహార శైలితో సీనియర్లు, సన్నిహితులు సహా విసిగిపోతున్నారా? మొన్న బాగున్న పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజులకే అనామకంగా అవ్వబోతోందా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జనం 135 స్థానాలు ఇచ్చి నీరాజనాలు పలికితే వంద రోజుల్లో పార్టీలో కుంపట్లతో అసంతృప్తులా! ఎందుకీ పరిస్థితి అని అనుమానం వ్యక్తం చేశారు. మొన్న మస్తాన్ రావు, మోపిదేవి, నిన్న బాలినేని, సామినేని ….లిస్ట్ ఇంకా ఉందా అని వ్యాఖ్యానించారు. ఇంకెంతమందిని అవినీతి సొమ్ముతో కొంటారని నిలదీశారు. రాష్ట్రఅభివృద్ధికి నోచుకోక, సంక్షేమ పథకాలు అమలులో వైఫల్యంతో ఇక జమిలి ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేయ్యడమేనా అని అన్నారు. టీడీపీ బీజేపీ లోకి విలీనమౌతుందా అని ప్రశ్నించారు.
విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్లు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు సీఎం చంద్రబాబు అని విజయసాయిరెడ్డి అన్నారు.
మోదీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే కృష్ణానది కరకట్టపైన కట్టిన అక్రమ ఇంట్లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు మన ముఖ్యమంత్రి అని విమర్శించారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలని హితవు పలికారు. ఆంధ్రరాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలని అన్నారు.