Posani Krishnamurali | టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. జగన్‌ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా.. బీజేపీ పెద్దలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను మోదీ, అమిత్ షా వినలేదా? అని అడిగారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఒక్కసారైనా ఖండించారా? అని ప్రశ్నించారు. జగన్‌పై దాడి చేయాలని చంద్రబాబు చెప్పారని.. అయినా దీనిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని హత్యలు చేసినా ఓకేనా అని ప్రశ్నించారు.
అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణాలకు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు బారి నుంచి జగన్‌ను కాపాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. రెండు సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని విమర్శించారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్ ఆర్థిక నేరస్తులని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను జైలులో పెట్టిన బీజేపీ.. వేల కోట్ల ప్రజాధనం తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపించలేదన్నారు. బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా అని ప్రశ్నించారు. జగనే తనపై రాయి వేయించుకున్నారని పవన్ కల్యాణ్ చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు దేవుడైపోయారా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోసాని అన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని జగన్ సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఎంతమంది కలిసొచ్చినా జగన్‌ను ఓడించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు మరోసారి ఘనవిజయం అందించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.