అమరావతి : ముంబై నటి కాదంబరి జత్వాని ( Kadambari Jatwani case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ (IPS) అధికారి కాంతిరాణా తాతా ( Kanti Rana Tata) కోర్టు మెట్లు ఎక్కారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు (Highcourt) లో శుక్రవారం ముందస్తు బెయిల్ పిటిషన్ (Bail Petition) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది.
ఇప్పటికే ముంబై నటి కేసులో ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో కాంతిరాణా ఒకరు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారి విశాల్గున్నిలను వారం క్రితం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు. అటు, పరారీలో ఉన్న వైసీపీ నేత విద్యాసాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నటి ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు.
అసలు ఏం జరిగిందంటే ..
ముంబై నటి కాదంబరి జత్వాని ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మనస్పర్ధాలు రావడంతో ఆమె పారివ్రామికవేత్తపై పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి సదరు పారిశ్రామిక వేత్త వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీకి చెందిన కీలకనేతను కలిశారు.
ఆ నేత ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి వ్యూహం ప్రకారం ముంబై నటి జత్వానిపై అక్రమంగా కేసు బనాయించి ఆమెను, ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకొచ్చి 45 రోజుల పాటు జైల్లో ఉంచారు. వారికి బెయిల్రాకుండా అడ్డుకున్నారు. పారిశ్రామికవేత్తపై ముంబైలో పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు చేశారు. ఎట్టకెలాగు ఆమె జైలు నుంచి విడుదల తిరిగి స్వస్థలానికి వెళ్లి పోయింది.
ఈ దశలో ఏపీలో ఎన్నికలు రావడం వైసీపీ అధికారం కోల్పోవడం, కూటమి అధికారంలోకి రావడంతో కాదరంబరి జత్వాని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ ప్రారంభించిన ప్రభుత్వానికి ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుల్లో ఐపీఎస్ల పాత్ర ఉండడంతో ప్రత్యేక అధికారితో విచారణ చేయించి ప్రాథమికంగా ముగ్గురు అధికారులపై వేటు వేశారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఐపీఎస్ కాంతిరాణా ముందస్తుగా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.