అమరావతి : కాలం కలిసి వస్తే అదృష్టయోగం పడుతుందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇటీవల జరిగిన రాజకీయ, అధికార మార్పిడి ఓ కుటుంబంలో బాబాయి, అబ్బాయికి మంత్రి పదవులు వరించాయి . అయితే అబ్బాయి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయగా, బాబాయి రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయడం వారి కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించింది. పార్లమెంట్(Parliament), అసెంబ్లీ(Assembly) స్థానాలకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడిగా పోటీ చేసింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలుండగా కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. 25 ఎంపీ స్థానాలకు 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కింజరపు అచ్చెన్నాయుడు(Acchennaidu) చంద్రబాబు మంత్రి వర్గంలో మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రంనాయుడు కుమారుడైన రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరిద్దరూ బాబాయి, అబ్బాయి మంత్రులు కావడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎర్రన్నాయుడు అల్లుడు వాసు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం.