AP News | ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని బలైంది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని విద్యార్థినిపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది.
కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన బాలిక ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. బాలిక నివాసం ఉండే వీధికి చెందిన విఘ్నేశ్ కడపలోని ఓ హోటల్లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. విఘ్నేశ్‌తో ఆ బాలికకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి సన్నిహితంగా మెలిగేవాడు. కాగా, విఘ్నేశ్‌కు ఆరు నెలల క్రితమే వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య గర్భిణి. శుక్రవారం రాత్రి బాలికకు ఫోన్ చేసిన విఘ్నేశ్.. నువ్వు లేకపోతే చచ్చిపోతాను.. నీతో మాట్లాడాలని బయటకు రా అని చెప్పాడు. నువ్వు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో భయపడ్డ బాలిక శనివారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అనంతరం ఆటోలో నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కాలేజీ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న విఘ్నేశ్ కూడా ఆటోలో ఎక్కడాఉ. ఇద్దరూ ఆటోలో పీపీకుంట చెక్ పోస్టు వద్ద దిగారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు.
అటవీ ప్రాంతానికి వెళ్లిన తర్వాత తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అందుకు బాలిక ఒప్పుకోలేదు. నీకు ఆల్రెడీ పెళ్లయ్యింది కాబట్టి ఆ అమ్మాయిని వదిలేసి రావాలని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన విఘ్నేశ్ బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు తాళలేక బాలిక కేకలు వేస్తూ రహదారిపైకి పరిగెత్తడంతో అటువైపుగా వస్తున్న ఓ లారీ డ్రైవర్ గమనించి.. దుప్పటితో మంటలను ఆర్పివేశాడు. స్థానికంగా ఉన్న మహిళలు అతనికి సాయం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలిని చేరుకుని పరిశీలించిన పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందింది.
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన గురించి తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన నాలుగు ప్రత్యేక బృందాలు.. శనివారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.