AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కూడేరు మండల పరిధిలో ఇంటర్ విద్యార్థినిని కిరాతకంగా హత్య చేశారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆ బాలిక మృతదేహం.. ఆదివారం నాడు ఎన్సీసీ నగర్ మణిపాల్ స్కూల్ వెనుక ఉన్న ముళ్ల పొదల్లో లభించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనాస్థలంలో బీర్ బాటిల్ లభించడంతో.. దానితోనే విద్యార్థినిని కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన తన్మయి ఆకుతోటపల్లి వద్ద గల రామకృష్ణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 3వ తేదీన ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి 9 గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్డ్రింక్ తాగడానికి అని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. తెలిసినవాళ్లు, బంధువులను అడిగినప్పటికీ లాభం లేకపోవడంతో ఈ నెల 4వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ఉన్న ముళ్ల పొదల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
గుర్తించలేని విధంగా ముఖం కాలిపోయి, ఉబ్బిపోయి ఉండటంతో పాటు శరీరంపై కాలిన గుర్తులు ఉన్నాయి. దీంతో ఆమెను ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమనిస్తున్నారు. తన్మయిపై దాడి చేసి, పెట్రోలు పోసి కాల్చి చంపి.. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేసినట్లు భావిస్తున్నారు. పోలీసుల సమాచారంతో అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులు ఆ మృతదేహం తమ కుమార్తెదేనని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
ముగ్గురు నిందితుల అరెస్టు!
తన్మయి హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన రోజు నాటి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఓ యువకుడితో తన్మయి స్కూటీపై వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆమె కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కూటమి సర్కార్లో సైకోలకు తావు లేదు : నారా లోకేశ్
ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యపై హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇక విద్యార్థిని తన్మియ హత్య తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దుండుగలు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టడం షాక్కు గురిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని.. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాల అండగా నిలుస్తామని చెప్పారు.