అమరావతి : వైసీపీ (YCP) హయాంలో చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడుతుండడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు చంద్రబాబును తిడుతూ టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha ) ఆరోపించారు. ఆదివారం విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వాములయ్యారని వార్తలు వస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విజయసాయి రెడ్డి వైసీపీలో శకుని లాంటి పాత్రను పోషిస్తున్నారని విమర్శించారు.
కాకినాడ పోర్ట్ ( Kakinada Port) వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని, బియ్యం అక్రమ రవాణా మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. విశాఖలో భూ ఆక్రమాణల్లో వైసీపీ నాయకుల పాత్ర ఉందని తెలిపారు.బాధితులు ముందుకువచ్చి వారిపై ఫిర్యాదు చేస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు చంద్రబాబు ‘ఈగల్’ అనే వింగ్‌ను ప్రారంభించారని , గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు డ్రోన్లను వాడుతున్నామని వివరించారు. విశాఖ రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి 7995095793 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు.