Srisailam | శ్రీశైలంలో త్వరలో ప్రారంభం కానున్న ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేవస్థానం పరిధిలోని సత్రాల నిర్వాహకులతో పోలీసు శాఖ సమావేశమైంది. 2022 నాటి ఉగాది ఉత్సవాల సమయంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రత, శ్రీశైల క్షేత్ర పవిత్రత, ప్రతిష్టను కాపాడేందుకు సహకరించాలని సత్రాల నిర్వాహకులను పోలీసు అధికారులు కోరారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనార్ధం వచ్చే యాత్రికులకు శ్రీశైలంలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలి. ప్రతి సత్రం ప్రధాన ద్వారం వద్ద భక్తుల కొరకు రెండు ఉచిత చల్లని వాటర్ ఫ్రిజ్‌లు, దానికి ఇనుప చైన్లతో కట్టిన నాలుగు గ్లాస్లు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి.
ప్రతి సత్రంలోనూ నెల రోజుల బ్యాకప్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలు, వాటిని పర్యవేక్షించడానికి ఒక ఒక టెక్నీషియన్ ను నియమించుకోవాలి.
భక్తులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు ప్రతి సత్రంలోనూ వివిధ కేటగిరీల రూముల ధరల పట్టికను రిసెప్షన్లో ప్రదర్శించాలి.
శ్రీశైల క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం – 1987 అమలులో ఉంటుంటుంది. కనుక సత్రాల యాజమాన్యాలు, వాటి ప్రతినిధులు ఎక్కువ మందితో సభలు, సమావేశాలు జరుపరాదు. గొడవలు జరుగనివ్వరాదు.
సత్రాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగనివ్వవద్దు. జూదం ఆడనివ్వవద్దు. మద్యం సేవించకూడదు. మాంసం తినకూడదు.
కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి.
ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వచినప్పుడు వారి ఆధార్ నంబర్లతోపాటు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
సత్రాల నిర్వాహకులు తమ సత్రాల్లో పని చేసే వారిని నియమించుకునే సమయంలో వారి పూర్వాపరాలు, ప్రవర్తన తదితర విషయాలు తెలుసుకుని నియమించుకోవాలి.
సత్రాల్లో భక్తులకు అందించే భోజనాన్ని ఆహార భద్రతా అధికారులతో తనిఖీ చేయిస్తూ ఉండాలి.