Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తుందని ప్రియురాలిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆమెను ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన రవీంద్ర ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహితురాలు మౌనిక (28)తో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల మౌనిక డబ్బుల కోసం వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ప్రియురాలు మౌనికను ఆదివారం తన ఇంటికి రమ్మని పిలిచాడు, రాత్రి వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత డబ్బుల విషయంలో మరోసారి వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ఆగ్రహానికి గురైన రవీంద్ర ఇంట్లో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపేశాడు.
ఆ తర్వాత మౌనిక మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి సగభాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. డబ్బుల కోసం తీవ్రంగా వేధిస్తోంది.. అది తట్టుకోలేకనే మౌనికను హతమార్చానని రవీంద్ర వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మౌనిక తల మాత్రం మిస్ అయినట్లు సమాచారం.