తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండపైకి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 20 కంపార్టుమెంట్లలో స్వామివారిని దర్శించుకునేందుకు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 68,469 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 27,025 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు వచ్చిందని వెల్లడించారు. ఉత్తరాధి మఠానికి చెందిన సద్గురు సత్యాత్మ తీర్థ స్వామిజీ నిన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు.
టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌కు అదనపు బాధ్యతలు
తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌కు టీటీడీ బోర్డు అదనపు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జేఈవో వీరబ్రహ్మంకు అదనపు ఈవోగా బాధ్యతలు అప్పగించింది. ఈవోగా పనిచేస్తున్న ధర్మారెడ్డి కుమారుడు రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడంతో ఆయన జనవరి 2వ తేదీ వరకు సెలవుల్లో ఉన్నారు. 3వ తేదీన ధర్మారెడ్డి విధుల్లో చేరనున్నారు.