అమరావతి : పీఆర్సీ, సహా ఇతర ఆర్థిక, ఆర్థికేత అంశాలపై ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. మొదటి నుంచి ఏపీ ఉద్యోగ జేఏసీ , అమరావతి జేఏసీలు పీఆర్సీ నివేదికను ఇవ్వాలని చర్చలో పాల్గొన్న ఉన్నాతాధికారులను కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నివేదిక ఇవ్వలేమని వారు తేల్చిచెప్పారు. నివేదికలోని అంశాలపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. తిరుపతిలో సీఎం జగన్ పీఆర్సీపై ప్రకటన చేసినందున మరో 10 రోజుల వరకు పీఆర్సీని ప్రకటిస్తామని అధికారులు జేఏసీ నాయకులకు వివరించారు.
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా చర్చలెలా సాధ్యమని జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు , బండి శ్రీనివాస రావు తెలిపారు. చర్చల్లో పాల్గొన్న కార్యదర్శుల కమిటీ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఆరోపించారు. నివేదిక లేకుండా పీఆర్సీ ప్రకటిస్తే అంగీకరించబోమని, నివేదిక ఇచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.