Sankranti | సంక్రాంతి పండుగ అంటే ఎంతో సందడి ఉంటుంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ హడావుడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఏ పల్లెనూ చూసినా ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కోడి పందేలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలతో కళకళలాడుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఓ పల్లెలో మాత్రం ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోరు. సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం కాదు కదా.. ఆ రోజు కనీసం ఇంటిని ఊడ్వడం కూడా చేయరట!
అనంతపురం జిల్లా ఆత్మకూరు నుంచి కల్యాణదుర్గం వెళ్లే మార్గంలో పి.కొత్తపల్లి గ్రామం ఉంది. ఈ క్రమంలో కమ్మ, బోయ, ఎస్సీ కుటుంబాలు ఉంటాయి. దాదాపు 300 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ఎన్నో ఏండ్లుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం లేదు. తెలుగు ప్రజలకు ఎంతో పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఎందుకు జరుపుకోవడం లేదంటే.. ఆ గ్రామస్తులు తమ పూర్వీకులు చెప్పిన ఒక కథను చెబుతుంటారు.
కొన్ని శతాబ్దాల క్రితం కొత్తపల్లి గ్రామంలో కూడా సంక్రాంతి జరుపుకునే వారు. అలా ఒకసారి సంక్రాంతి పండక్కి సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి కొత్తపల్లి నుంచి ఆత్మకూరు సంతకు వెళ్లాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆ వ్యక్తి కుప్పకూలి మరణించాడు. దీన్ని అందరూ లైట్ తీసుకున్నారు. అయితే ఆ మరుసటి రోజు ఇలాగే సంతకు వెళ్లిన ముగ్గురు హఠాన్మరణం చెందారు. దీంతో ఆ గ్రామస్థుల్లో కొంచెం భయం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పండక్కి సంతకు వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి రాకపోవడంతో వారికి సంక్రాంతి అంటే భయం మొదలైంది. సంక్రాంతి పండుగ చేసుకుంటే ఏదో అనార్థం జరుగుతుందని భయపడిపోయారు. అప్పట్నుంచి తమ ఊళ్లో సంక్రాంతి జరుపుకోవద్దని నిర్ణయించుకున్నారు.
తరాలు మారినప్పటికీ ఆనాడు అప్పటి పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని కొత్తపల్లి గ్రామస్థులు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. పెద్దల ఆచారాన్ని గౌరవిస్తూ సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజుల పాటు ఇల్లు, వాకిలిని శుభ్రం చేయరు. ఇంటి ముందు ముగ్గులు వేయరు. పిండి వంటలు చేసుకోరు. అంతెందుకు స్నానాలు కూడా చేయరట.