అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 2024-25 సంవత్సరానికి ఎస్ఎల్బీసీ(SLBC) రుణ ప్రణాళికను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5.4 లక్షల కోట్ల రుణ ప్రణాళిక (Loan Plan) ను ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandra Babu) విడుదల చేశారు. మంగళవారం విజయవాడలో సీఎం అధ్యక్షతన బ్యాంకర్ల ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. ఇందులో రూ.3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ. 1.65 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను ఖరారు చేశారు.
వ్యవసాయ రంగానికి రూ. 2.64 లక్షల కోట్లు రుణాల లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయ రంగానికి (Agriculture sector) గతం కంటే 14 శాతం అధిక రుణాలు ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు. డెయిరీ, పౌల్ట్రీ(Poultry) , ఫిషరీస్, సాగులో యాంత్రీకరణ, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఏపీలో గత ఐదేండ్లలో జగన్ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని ఛిన్నాబిన్నం చేశారని ఆరోపించారు.
డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని పేర్కొన్నారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని, వ్యవసాయం రంగం, పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ , బ్యాంకర్లు పాల్గొన్నారు.