అమరావతి : రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఏపీ సర్కార్ కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను ( Traffic rules ) అమలు చేస్తుంది. ఇకపై ట్రాఫిక్‌ను ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై భారీ జరిమానా విధిస్తుంది. ఏపీ హైకోర్టు ( AP High Court ) ఆదేశాలతో కొత్త రూల్స్ శనివారం నుంచి ప్రారంభమయ్యింది . విజయవాడలో ( Vijayawada ) ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
మూడు నెలలుగా విజయవాడలో నో హెల్మెట్.. నో ఎంట్రీ రూల్ అమలు చేస్తున్నారు. ఆ రూల్స్‌తో పాటు మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలోని 12 రకాల కొత్త నిబంధనలను అమలు అవుతుండగా వాహనదారులు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నట్లు కొత్త సర్క్యులర్‌ను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. సెల్‌ఫోన్ ( Cell Phone ) మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇదివరకు రూ. 1,500 ఉన్న జరిమానాను ఏకంగా రూ. 10 వేల వరకు పెంచారు.
హెల్మెట్ ధరించకుంటే రూ. వెయ్యి, బైక్ వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకుంటే రూ. వెయ్యి ఫైన్ వేయనున్నారు. ఇన్సురెన్స్ లేకుంటే రూ. 2 వేలు నుంచి రూ. 4వేల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా రూ. 5వేలు జరిమానా, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ. 1,500లు , ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుంటే రూ. 150 నుంచి 300 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
కారు డ్రైవర్‌తోపాటు.. ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకుంటే ఒక్కొక్కరికి రూ. వెయ్యి, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే 2వేలు నుంచి 5వేల వరకు జరిమాన వేస్తామన్నారు. అతివేగంతో వాహనం నడిపినా, బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేసినా రూ. వెయ్యి జరిమానా ఉంటుందన్నారు. కారు , బైక్ రేసింగ్‌లకు పాల్పడితే రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.