అమరావతి : మొంథా తుపాను (Cyclone Montha) కారణంగా ఏపీ సర్కార్ పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు (Holidays) ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు సెలవును ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అనకాపల్లి ( Ankapalli ) జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు ఈనెల 27, 28, 29 మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో 27, 28వ తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కలెక్టరేట్, రెవెన్యూశాఖ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల్లో మొంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణశాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు పలు చర్యలు తీసుకున్నారు తుపాను పరిస్థితుల దృష్ట్యా ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలు తిరగవద్దని , ఇప్పటికే బీచ్లు, పర్యాటక రీక్రియేషన్ సంబంధిత కార్యకలాపాలను నిలిపివేసినట్లు వెల్లడించారు.