అమరావతి : ఏపీలో వైసీపీ నాయకులు (YCP Leaders) రాజకీయ ముసుగులో అరాచకాలకు, నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సీఎం చంద్రబాబు(Chandra Babu) ధ్వజమెత్తారు. నేరగాళ్లకు సమాజంలో స్థానం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలోని బుడమేరు (Budameru) వాగుకు పూడ్చివేసిన గండ్ల ప్రాంతాన్ని మంత్రి రామానాయుడుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీలోకి ముప్పై టన్నుల భారీ బోట్లను వదలిపెట్టి డ్యాం గేట్లను ధ్వంసం చేసి ప్రజలు జలసమాధి అయ్యేలా కుట్రలు పన్నారని ఆరోపించారు. విజయవాడ ప్రాంత ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణ (Apology) చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు. మనుషుల్లా ప్రవర్తించడం లేదని విమర్శించారు.
రాజకీయ ముసుగులో రంగులు వేసుకుని వస్తే సహించబోమని హెచ్చరించారు. ఐదేళ్లలో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి సేవలందించాలని సూచించారు. ఒకప్పడు నిర్లిప్తంగా ఉండే అధికారులు నేడు వరదల్లో ప్రజలను ఆదుకునేందుకు సమర్ధవంతంగా పనిచేశారని అభినందించారు.
వరద సహాయం కింద రావలసిన నిధులతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరామని చంద్రబాబు వెల్లడించారు. బుడమేరు వాగుపై మళ్లీ వరద రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.