Srisailam | శ్రీశైలం దేవస్థానంలోని దవాఖానకు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వాసి ఇందుకూరి సిద్దారెడ్డి శుక్రవారం వైద్య పరికరాలు అందజేశారు. వివిధ రక్త పరీక్షల నిర్వహణ కోసం ఉపయోగించే హేమటాలజీ అనలైజర్, మూత్ర పరీక్షలకు వినియోగించే యూరిన్ కెమెస్ట్రీ ఆటోమేటేడ్ అనలైజర్ పరికరాలను వీరు అందజేశారు. వీటి విలువు సుమారు రూ.4 లక్షలు ఉంటుందని దాతలు తెలియజేశారు. ఆయా పరికరాలను దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాతలు అధునాతన పరికరాలను అందజేయడంతో దవాఖాన ద్వారా స్థానికులు, యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించే వీలు కలిగిందన్నారు. ఇందుకు దాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పీఆర్ఓ టీ శ్రీనివాసరావు, పర్యవేక్షకులు గంజిరవి, ఎం. శ్రీనివాసరావు, దేవస్థాన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు, డా. సాయికిషన్, డా.సంఘమేష్ తదితరులు పాల్గొన్నారు.