Srisailam Dam | ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది వరద కొనసాగుతున్నది. భారీగా వస్తున్న వరదతో ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండిపోయింది. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని వరదను అధికారులు దిగువకు వదులుతున్నారు. అక్కడి నుంచి వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 854.20 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.7132 టీఎంసీల నిలువ ఉన్నదని వివరించారు. అయితే, శ్రీశైలం డ్యామ్ కుడి, ఎడమ వైపు ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. నీటి మట్టం పెరిగితేనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.