శ్రీశైలం: ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జలాశయానికి సుంకేశుల, జరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.56 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులో నీరు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో మంగళవారం ఉదయం క్రస్ట్ గేట్లను తెరవనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఉదయం 11.50 గంటలకు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లను ఎత్తనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీశైలం మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు.