అమరావతి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గంట గంటకూ వరద ఉద్ధృతి భారీగా పెరుగుతుంది. మధ్యాహ్నం బ్యారేజీ వద్ద 20.60 అడుగుల నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 21.30 అడుగులకు చేరుకుంది. బ్యారేజీ నుంచి 25.08 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగితే ఆరు జిల్లాలపై ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయి.
కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలపై వరద ప్రభావం కనిపిస్తోంది. అల్లూరి జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలోని 4 మండలాలపై వరద ప్రభావం పడనుంది. ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాల కూడా ముంపు బారిన పడే అవకాశముంది. ఇప్పటివరకు 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు.దీంతో గోదావరి తీర ప్రాంతాల్లోని లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో వారిని అధికారులు పునరావాసాలకు తరలించారు. దాదాపు కరెంట్ స్తంభం మూడింతల వరకు నీరు వచ్చి చేరడంతో అనేక ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లల్లోని సామగ్రి గోదావరి పాలైంది.
పంటలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలో తీరానికి ఆనుకుని ఉన్న వందకుపైగా లంక గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తమను ఆదుకునేవారు కరువయ్యారని, సర్కారు కనీసం పట్టించుకోక పోవడంతో వేలాది మంది బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. ఇప్పటికే 8 మండలాల్లో లంక గ్రామాలకు అధికారుల జాడే లేదు. కుక్కునూరులో ఇంకా అనేక కుటుంబాలు నీటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.