Kasibugga | ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక మాసం ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటి? ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారనే దానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిముకుంద పండా 13 ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. గోవింద నామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఎదురుచూశారు. చివరకు ఆలయంలోనికి వెళ్లిన తర్వాత పట్టుమని పది సెకన్ల కూడా స్వామి వారిని తనివితీరా చూడనివ్వలేదు. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు. దీంతో నిరాశగా ఊరికి వెళ్లిపోయాడు. కానీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనుకున్నంతగా కాలేదని తీవ్ర నిరాశ చెందాడు. ఈ క్రమంలోనే ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. శ్రీకాకుళం పట్టణం కాశీబుగ్గలో తనకు 100 ఎకరాల భూమి ఉంది. దీంతో ఆ భూమిలో వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నిర్మించాలని భావించాడు. ఈ క్రమంలోనే 12 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాడు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో రూపొందించారు. నవగ్రహాల విగ్రహాలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలను ఎక్కడ ఏర్పాటు చేశారు.