అమరావతి : ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆక్షేపిస్తూ ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. తక్షణమే ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించి విషయమై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల తరువాత ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఈ తీర్పును అమలు చేయకపోవడంతో బుధవారం ఏపీ హైకోర్టులో మళ్లీ వాదనలు జరిగాయి. ఇదివరకే ఇచ్చిన కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పును అమలు చేయని కారణంగా ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు నెలరోజుల పాటు జైలుశిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఇద్దరు అధికారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
క్షమాపణతో తీర్పును సవరించిన కోర్టు.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశం
హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించిన కేసులో ఏపీకి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు రాజశేఖర్, రామకృష్ణలకు విధించిన జైలు శిక్షను ఏపీ హైకోర్టు తగ్గించింది. బుధవారం ఉదయం వీరిద్దరిపై ఏపీ హైకోర్టు నెలరోజుల పాటు జైలు శిక్ష విధించగా అధికారులు క్షమాపణ కోరడంతో ఉదయం ఇచ్చిన తీర్పును సవరిస్తూ మరో తీర్పును ఇచ్చింది. అయితే ఇద్దరు అధికారులు ఈరోజు సాయంత్రం వరకు కోర్టులో నిలబడి ఉండాలని ఆదేశించింది.