AP Cabinet | ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు ఆర్థికసాయం అందించే పథకానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలోకి రూ.15వేలను జమ చేస్తారు. ఈ మేరకు ఈ పథకం ప్రారంభానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కెబినెట్ భేటీ అయ్యింది. దాదాపు 20 అజెండా అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారవాన్ పర్యటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి పదం తొలగించేందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయంతో పాటు, విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు , కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను ఆమోదించింది.