AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.
సూపర్ సిక్స్ పథకాలతో పాటు షణ్ముఖ వ్యూహంలోని పథకాలు కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమైనవని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. వీటిని సూపర్ సిక్స్ పథకాలతోనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జనసేన షణ్ముఖ వ్యూహం హామీల్లో ఒకటైన యువకులకు రూ.10 లక్షల వరకు రాయితీ ఇచ్చే సౌభాగ్య పథకం బృహత్తరమైనదని ఆయన పేర్కొన్నారు. సంపద చేకూర్చే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేశారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో జనసేన ఇచ్చిన షణ్ముఖ వ్యూహం హామీలను మాత్రం పక్కనపడేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం దీని గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఇలాంటి సమయంలో షణ్ముఖ వ్యూహం హామీలను హరిరామ జోగయ్య ప్రకటించడం సంచలనంగా మారింది.