Kidney Scam | విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరించింది. దీంతో బాధితుడు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పరిచయమయ్యాడు. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 30 లక్షల డబ్బు వస్తే తన సమస్యలు అన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు.
మధుబాబు ఒప్పుకోవడంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు. ఆపరేషన్ తర్వాత మధు బాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 1.10 లక్షలు మాత్రమే బాషా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు అడిగేసరికి బాషా తన నిజస్వరూపం బయటపెట్టాడు. స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు. కాబట్టి నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ శరత్‌బాబు, మధ్యవర్తి బాషాపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశాడు.