AP News | అత్తా కోడళ్లకు మామూలుగానే పడదు. వీళ్ల మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే చివరకు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే ఫర్వాలేదు.. కానీ అది ముదిరితేనే ప్రమాదం. ఇలాగే అత్తతో జరిగిన వాగ్వాదం ఎక్కువ కావడంతో కోపం పెరిగిపోయిన ఓ కోడలు తీవ్రంగా స్పందించింది. అత్త చెవి తెగిపడి, రక్తం కారే దాకా కొరికింది. ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తుళ్లూరులోని కంభంపాటి నాగమణి (55) కుమారుడు శేషగిరితో పావని (30)కి కొన్నేండ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వీళ్ల కాపురం బాగానే ఉంది కానీ అత్తా కోడళ్లకు ఎప్పుడూ పడకపోయేది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరిక మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉండేది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది.
ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన కోడలు పావని అత్తపై విరుచుకుపడింది. నాగమణి తలను గట్టిగా పట్టుకుని చెవిని కొరికివేసింది. రక్తం కారి చెవి భాగం ఊడి వచ్చే దాకా పళ్లతో అలాగే అదిమి పట్టుకుంది. చెవి భాగం ఊడిపడటంతో అప్పుడు కోడలు వదిలేసింది. ఇది గమనించిన స్థానికులు పావనిని ఆపి.. తెగిపడిన చెవితో పాటు నాగమణిని తుళ్లూరు పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో చెవిని తిరిగి అతికించడం కష్టమని వైద్యులు చెప్పారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అత్త చెవిని కోడలు కొరికివేసిందన్న సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.