Gudivada Amarnath | రుషికొండ భవనాలను వాడుకునేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, షాడో సీఎం పోటీ పడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, షాడో సీఎం లోకేశ్ విశాఖ పర్యటనకు వచ్చి కీలకమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోగా.. చులకనగా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో సున్నితమైన పరిస్థితులు ఉన్నప్పుడు.. జగన్‌ను బూచిలా చూపించడం కూటమి నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుషికొండ కూటమి నాయకులకు టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారిందని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైజగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. సీఎం నివాసం కోసం టూరిజం రిసార్ట్ నిర్మాణం జరిగిందని వివరించారు. కానీ అది ఎన్నికల్లో గెలవడం నుంచి ఇప్పటిదాకా కూటమి నేతలు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రుషికొండ భవనాలను ఎవరు వాడుకోవాలనే దానిప చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మధ్య పోటీ నెలకొందని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో పెద్ద భవనం కడితే అది పూరి గుడిసె, అమరావతిలో ఐదు ఎకరాల్లో కడితే అది స్కీమ్ ఇల్లు.. వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే మాత్రం అది ప్యాలెస్ అని మండిపడ్డారు.
రుషికొండ భవనాలపై ఎన్నికల ముందు కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. తాజాగా ఈ భవనాల మీద అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం జీవోలో రిసార్ట్ అని పేర్కొన్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రుషికొండ భవనాలను రిసార్ట్ అని పేర్కొనడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. అది జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ అని తప్పుడు ప్రచారం చేయడానికి రుషికొండను వాడుకున్నారని దీనితో స్పష్టమవుతుందని తెలిపారు. అది జగన్ ప్యాలెస్ అనేది నిజమైతే, ఆ విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి రుషికొండలో పవన్ కల్యాణ్ డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
అమరావతిలో రూ.5వేల కోట్లు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టిన చరిత్ర టీడీపీది అని గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ పర్యటనకు వెళ్లినప్పుడు పీఓపీ స్లాబ్ కూలినట్లుగా ఉన్న ఫొటోలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫొటోలు చూస్తుంటే అది పడిపోయినట్లుగా లేదని.. కట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. రుషికొండ తరహాలోనే అమరావతిలో కూడా పవన్ కల్యాణ్ ఫొటోషూట్ పెడితే అసలు బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికే కారిపోతుందని తెలిపారు. చదరపు అంగుళానికి రూ.13వేలు పెట్టి కట్టారని.. వాటి దుస్థితి చూడాలని పవన్‌కు సూచించారు. ఏ రోజైనా పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అమరావతి సచివాలయానికి వెళ్లారా అని ప్రశ్నించారు.