కాకినాడ : బే ఆఫ్ బెంగాల్ (Bay of Bengal) లో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను (Montha cyclone) ఆంధ్రప్రదేశ్ తీరానికి మరింత చేరువవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కాకినాడ పోర్టు (Kakinada port) లో అత్యంత తీవ్ర హెచ్చరిక అయిన 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మొత్తం 25 బృందాలను ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు తరలించారు.
ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ నరేందర్ సింగ్ బుందేలా మీడియాతో మాట్లాడుతూ.. తుఫానును ఎదుర్కొనేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ‘కొన్ని రోజుల క్రితమే క్యాబినెట్ సెక్రెటరీ స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించి, నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న తీర ప్రాంతాల్లో మా బృందాలను ముందస్తుగానే మోహరించాం. తీరం దాటిన తర్వాత తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం’ అని తెలిపారు.
బంగాళాఖాతంలో తుఫాను తీవ్రత పెరుగుతుండటంతో విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది. కాకినాడలో 10వ నెంబర్ సిగ్నల్ ఎగురవేయగా, విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులలో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావం పొరుగు రాష్ట్రమైన తమిళనాడుపైనా ఉండవచ్చన్న అంచనాలతో అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.