Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శనివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి మొదలైన ప్రభోత్సవం నందిమండపం వరకు సాగింది. ఈ వేడుకలో పాల్గొన్న వేలాది మంది భక్తులు స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ప్రభపై అర్చక వేద పండితులు కూర్చుని ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు, అక్షింతలు అంద జేశారు. ప్రభోత్సవం ముందు కోలాటాలు, చెక్కభజనలు, సంప్రదాయ మేళాల చప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయని ఈవో లవన్న అన్నారు.
ప్రభోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లు నందివాహనంసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం సాయంత్రం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను వేంచేబు చేశారు. షోడషోపచార పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు నందివాహన పై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉత్సవం ఆద్యంతం కళారూపాలతో ఆకట్టుకునేలా సందడిగా సాగింది.
మహాశివరాత్రి పర్వదినం కావడంతో శనివారం మల్లన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూల నుండి లక్షలాది మంది యాత్రికులు తరలి వచ్చారు. అర్థరాత్రి దాటిన తరువాత నుండి పాతాళగంగ వద్ద జల్లు స్నానాలు చేసుకుని ఉచిత, టిక్కెట్ దర్శనాలకోసం గంటల తరబడి క్యూకాంప్లెక్స్లలో వేచి ఉన్నారు. టైం స్లాట్స్ ప్రకారం నిర్ణీత క్యూలైన్లలోనే భక్తులను దర్శనాలకు అనుమతించారు. కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులు గుక్కెడు మంచినీళ్లకోసం ఎదురు చూసి వాటర్ ప్యాకెట్లకోసం తోపులాడుకున్నారు.
ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ ఇరుముడి సమర్పణలు చేయించారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణలు చేయించారు. యాత్రికుల కోసం కల్పించిన వసతులు దుర్వినియోగం కానివ్వవద్దని, ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని భక్తులను ఈవో లవన్న కోరారు. ఇక
ఆలయ దక్షిణ మాడవీధిలోని కళారాధన వేదికతోపాటు పుష్కరిణి, నిత్యకళావేదిక, శివదీక్షా శిబిరాల్లో భూకైలాస్ హరికథా గానం, శివపార్వతుల కథాగానం, సత్యహరిశ్చంద్ర నాటికలతోపాటు కూచిపూడి భరతనాట్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
లక్షల సంఖ్యలో తరలి వచ్చిన యాత్రికులకు కావలసిన అల్పాహారాలు, మంచినీరు, శీతలపానీయాలను అధిక ధరలకు అమ్ముతూ సామాన్య భక్తులను వ్యాపారులు దగా చేస్తున్నారు. తిలకధారణతో మెదలు ప్రసాదాలు, పసుపు కుంకుమ, విభూదిగుండ్లు, కంకణదారాలే కాకుండా ఫుట్పాత్ బండ్లపై అమ్మే తినుబండారాల ధరలు నియంత్రించాల్సిన శాఖ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా సామాన్య భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అధిక ధరలే కాకుండా నాణ్యతలేని వస్తువులు, ఆహార పదార్థాలు అమ్మేవారిని నియంత్రించాలని యాత్రికులు కోరుతున్నారు.