Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంభ అమ్మవారికి వార్షిక కుంభోత్సవ సాత్విక బలి ఘనంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున గ్రామదేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అటుపై భ్రమరాంబాదేవికి ఏకాంత పూజలు నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమార్చన, పారాయణాలు నిర్వహించామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.
ఆలయ సంప్రదాయంగా రజకుని ఆధ్వర్యంలో శ్రీ చక్రం వద్ద స్థల శుద్ది చేశారు. ఆ తర్వాత ముగ్గులు వేసి పూజలు చేశారు. వందల కేజీల పసుపు కుంకుమలతో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక వేద పండితులతో ఈవో లవన్న శాంతి ప్రక్రియను పూర్తిచేశారు. తదుపరి సుమారు 4,000 గుమ్మడి కాయలు, రెండువేలకుపైగా కొబ్బరి కాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో పూజలు చేశారు.
స్థానిక వ్యాపార సంఘం, ఉభయ తెలుగు రాష్ట్రాల దాతలు అందించిన నిమ్మకాయలు గుమ్మడికాయలతో అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించారు. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం కుంబోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి బలి గడియలు మంగళవారం రావడంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు పుర్తిచేసి అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు.
అమ్మవారి అంతరాలయంతో పాటు సింహమండపం వద్ద టన్నులకొద్ది వండిన అన్నం, పెసరపప్పుతో కుంభరాశులు పోసి పిండి దీపాన్ని వెలిగించారు. ఆ తరువాత మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజాభిషేకాలు, మహామంగళ హారతి సమర్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను వెండి పల్లకిపై ఉరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేశారు. అమ్మవారి ఉగ్ర రూప కిరణాలు స్వామివారిపై సోకకుండా స్వామి వారి లింగరూపానికి ఉల్లిపాయలు, జీలకర్ర. శొంఠి కలిపిన పెరుగన్నం, భక్షతో కప్పి ఉంచారు.
స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారంలో విధులు నిర్వహిస్తున్న వారితో సంప్రదాయం ప్రకారం రాత్రి ఏడు గంటలకు స్త్రీ వేషంలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి కుంభ హారతి ఇచ్చారు. వేలాదిగా తరలి వచ్చిన స్ధానిక భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ద్వారాలు మూసివేశారు. కుంభోత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక వ్యాపార సంస్థల నిర్వాహకులు, వేదపండితులు, అర్చకులు, ఆలయ పరిపాలనా సిబ్బంది అమ్మవారికి సాత్వికబలి సమర్పించుకున్నారు.