తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని (Venkateshwara Swamy) దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 66,715, మంది భక్తులు దర్శించుకోగా 24,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.06 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
డిసెంబర్ 30 నుంచి అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.