తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామి (Govindarajaswamy ) బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా మంగళవారం గోవిందరాజస్వామి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో నిర్వహించిన ఊరేగింపు భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.
బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయని, శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనం (Hanuman Vahanaam) పై ఊరేగారని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి సూపరింటెండెంట్ నారాయణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల (Tirumala) ప్రాంతం రద్దీగా మారింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోగా ఏటీసీ అతిథిగృహం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 85,825 మంది భక్తులు దర్శించుకోగా 36,146 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 4.40 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.