AP News | ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. ఈ మేరకు బుచ్చయ్య చౌదరికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి కోరారు. దీనికి బుచ్చయ్యచౌదరి అంగీకారం తెలిపారు. గురువారం ఉదయం బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు. ఈ నెల 21 న (శుక్రవారం ) జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక ఈ నెల 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు.
టీడీపీ సీనియర్ నాయకుల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి 60వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న గోరంట్ల.. పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.