Sparsha Darshanam | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ప్రతి శని, ఆది, సోమవారాలు, సెలవుదినాలు, రద్దీ రోజుల్లో స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడుతల్లో స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈ స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సిన ఉంటుందన్నారు. కరెంట్ బుకింగ్ ద్వారా పొందేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే, శని, ఆది, సోమవారాలు, రద్దీ రోజుల్లో స్వామి వార్ల స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసి.. పూర్తిగా అలంకార దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం పేర్కొంది.
భక్తుల విజ్ఞప్తులు, సూచనల మేరకు ఈ నెల 7న వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం విభాగాల అధికారులు, పర్యవేక్షకులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్వామివారి స్పర్శ దర్శనం విడతలవారీగా కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ఉదయం 4.30గంటల నుంచి 7.30గంటల వరకు అలంకార దర్శనం ఉంటుందని తెలిపారు. ఉదయం 7.30గంటల నుంచి 9.30 గంటల వరకు స్పర్శ దర్శనం, 9.30 నుంచి 11.45 గంటల వరకు అలంకార దర్శనం, ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు స్పర్శదర్శనం, మధ్యాహ్నం 1.30 గంటలకు సాయంత్రం 4గంటల వరకు అలంకార దర్శనం ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ శుద్ధి జరుగుతుందని తెలిపారు. ఇక సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30గంటల వరకు అలంకార దర్శనం, రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని దేవస్థానం కోరింది.