అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు తీపి కబురును అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ( Free gas cylinders ) పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ప్రకటించారు.
పండుగ రోజున సంతోషం నింపే విధంగా అర్హులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఈ పథకానికి ఏడాదికి రూ. 3వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. తదుపరి మంత్రివర్గ భేటీలో పథకానికి అనుమతి తీసుకుంటామని అన్నారు. సూపర్ సిక్స్ (Super Six) హామీల్లో భాగంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం కేవలం రాష్ట్రంలో 9లక్షల 60 వేల మందికి మాత్రమే సబ్సిడిపై అందిస్తుందని, తమ ప్రభుత్వం తెల్లకార్డులు కోటి 40 లక్షలున్నాయని, వీటిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండర్ను అందిస్తామన్నారు. భవిష్యత్లో ప్రజలకు ఉపయోగపడేవిధంగా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అందించనున్నామని ప్రకటించారు.