Goda Kalyanam | తిరుపతిలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.
గోదా కల్యాణంలో భాగంగా ముందు శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.

Goda Kalyanam2
సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. తదుపరి మహా సంకల్పం, స్వామి, అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమం, లాజ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.

Goda Kalyanam3
తర్వాత ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Goda Kalyanam4