అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం (Coalition Rule) పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ( Roja Selvamani) ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో తిరుమల( Tirumala ) పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలను భగవంతుడు గమనిస్తున్నాడని అన్నారు. సోమవారం ట్విటర్( Twitter ) లో కూటమి పాలనపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుందని విమర్శించారు.
సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ కూడా అవసరమని పేర్కొన్నారు. సంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని, వైఎస్ జగన్ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేదని వెల్లడించారు.
కూటమి హయాంలో స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారని, దర్శనాల సంఖ్య 60 వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు ( Break Darsan) ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోందని, . సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇదేనా సనాతన ధర్మం అని పవన్‌కల్యాణ్‌ను, సమూల ప్రక్షాళన అంటే ఇదేనా అంటూ చంద్రబాబును ఆమె ఎక్స్ వేదికలో ప్రశ్నించారు.