అమరావతి : ఏపీలో మహిళలకు ఉచిత సిలిండర్లు ( Free cylinders) ఇస్తూనే కరెంట్ బిల్లులు పెంచి పేదవాళ్లకు షాక్ ఇస్తున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేష్ (YCP leader Pothina Mahesh) ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కోటి 40 లక్షల కుటుంబాల పేదల జీవితాల్లో కారుచీకట్లు నింపుతున్నారని ట్విటర్లో విమర్శించారు.
సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు బిల్లు (Electricity Bills) పెంచబోమని హామీలిచ్చి మాటతప్పారని పేర్కొన్నారు. మూడు ఉచిత సిలిండర్లకు ప్రతి ఏటా సబ్సిడీ కింద రూ. 2, 685 కోట్లు ఎడమ చేత్తో ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ ధరలు పెంచి రూ. 17,072 కోట్లు బారం మోపుతున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో కోటి యాభై లక్షలు రేషన్‌కార్డులుండగా తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలకు మాత్రమే ఉచిత సిలిండర్‌ను అమలు చేయనున్నారని వివరించారు. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లల్లో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీదేవత కళకళలాడుతుందని అన్నారు.