Garuda Seva | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం రాత్రి శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి ప్రీతికరమైన గరుడవాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు. ఈ వేడుకను తిలకించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని తిలకిస్తూ.. చేసిన గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి. మూల విరాట్‌ను అలకరించే అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ్వర సహస్రమాల తదితర ఆభరణాలతో ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వారిని అలకరించి.. సేవను నిర్వహించారు. గరుడ వాహనంపై విహరించే మలయ్యప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం.
జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటి నమ్మకం. అందుకే గరుడ వాహనంపై విహరించే స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి సేవలన్నింటిలో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. గరువ సేవకు మూడులక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరుడ సేవ నేపథ్యంలో సాయంత్రం నుంచే గ్యాలరీల్లో భక్తులు బారులు తీరారు. 231 గ్యాలరీలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. గ్యాలరీల్లోనూ భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు. గరుడ సేవ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ తిరుమల ప్రత్యేకంగా 400 వరకు బస్సులను నడిపింది.