Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడునిపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవకు అత్యంత ప్రాముఖం ఉన్నది.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని.. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల క్షేత్రంలో ఒకే నెలలో రెండుసార్లు గరుడ సేవ జరిగింది. ఈ నెల 9న గరుడ పంచమి సందర్భం మలయప్పస్వామి గరుడ సేవ జరిగింది. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజున ఘనంగా నిర్వహిస్తారు. గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తుంటారు. ఇక ప్రతి పౌర్ణమికి తిరుమలలో గరుడ సేవ నిర్వహించే విషయం తెలిసిందే.