Free Bus Scheme | ఏపీలో పంద్రాగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తున్నారు. స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్న ఈ పథకంలోని లోటుపాట్లపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాట్ రోడ్లలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఆదేశించారు. గుర్తింపు కార్డు ఒరిజినల్ లేకపోతే సాఫ్ట్ కాపీ చూపించినా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని తెలిపారు. ధ్రువీకరణ కోసం జిరాక్స్‌తో పాటు మొబైల్ డిజిలాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ఆదేశించారు.
స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఈ సమీక్షలో అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణం చేశారని పేర్కొన్నారు. జీరో ఫేర్ టికెట్ల ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయ్యిందని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే గుర్తింపు కార్డుగా సాఫ్ట్ కాపీ చూపినా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సు సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపల, బయట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డలను అవమానించిన అంశంలో తాను, పవన్ కల్యాణ్ ఇద్దరం బాధితులమే అని తెలిపారు. క్యారెక్టర్ అసాసియేషన్ ఎవరు చేసినా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఎవరైనా తోక తిప్పితే తో కట్ అవుతుందని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి వెనుకాడమని స్పష్టం చేశారు.