అమరావతి : ఏపీ కూటమి పాలనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ( Bhumana Karunakar Reddy ) ఫైర్ అయ్యారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేస్తున్న సీఎం చంద్రబాబు ( Chandra babu) వైఖరిని పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు పాలన సర్వం మోసంగా మారిందని, అన్నదాత సుఖీభవ కాస్తా.. అన్నదాత అప్పోభవగా అయ్యిందని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి కాస్తా ఏడుపు విధిగా, తల్లికి వందనం కాస్తా తల్లికి తద్దినంగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో నారా భుజాలను మోసిన డిప్యూటీ సీఎం పవన్ ( Pawan Kalyan) ఇప్పుడు ఏ గుడి మెట్లు కడుగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పచ్చి అబద్దాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని కపట నాటకం ఆడుతున్నారని చంద్రబాబును విమర్శించారు. సూపర్ సిక్స్ అమలు పరిస్థితి లేదని, వృద్ధిరేటు పెంచిన తరువాత ఆలోచిస్తానని వెల్లడించడం దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల ఫించన్లు (Pensions) తొలగించిందని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి రూ. 19 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని భూమన విమర్శించారు.