Srisailam : ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam)లో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741/- నగదు లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ మొత్తాన్ని భక్తులు గత 27 రోజుల్లో (25.11.2025 నుండి 22.12.2025 వరకు) స్వామి, అమ్మవార్లకు సమర్పించిన నగదు అని వెల్లడించారు.
హుండీల్లో భారీగా విదేశీ కరెన్సీలు లభ్యమయ్యాయి. వీటిలో 57 యుఎస్ఏ డాలర్లు, 47 సింగపూర్ డాలర్లు, 20 సౌది అరేబియా రియాల్స్, 30 యూఏఈ దిర్హమ్స్, 80 ఆస్ట్రేలియా డాలర్లు,15 ఇంగ్లండ్ పౌండ్స్, 25 కెనడా డాలర్లు, 14 మలేషియా రింగిట్స్ఉన్నాయి. ఇవేకాకుండా ఖతర్ రియాల్స్ 3 , న్యూజిలాండ్ డాలర్లు 5 , సౌత్ ఆఫ్రికా రాండ్స్ 500ల చొప్పున హుండీలో వేశారు విదేశీ భక్తులు.
హుండీల్లోని నగదు లెక్కిస్తున్న సిబ్బంది
అయితే.. అప్రైజర్ హాజరు కానందున హుండీల్లోని బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను లెక్కించలేదు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ఈ హుండీల లెక్కింపులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివ సేవకులు, తదితరులు పాల్గొన్నారు.