అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళ వయనాడ్ (Wayanad disaster) బాధితుల కోసం రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) నుంచి రూ. 10 కోట్లను కేరళ ప్రభుత్వానికి శుక్రవారం అందజేసింది. వయనాడ్లో జులై 30న కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 310 మందికి పైగా మరణించగా వేల మంది నిరాశ్రయులయ్యారు.
బాధితులను ఆదుకునేందుకుగాను ఆయా రాష్ట్రాలు స్పందించి తోచిన సహాయాన్ని అందజేశారు. ఇందుల్లో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం (Andhra Pradesh Government) రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేసింది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం వయనాడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రభాస్ రెండు కోట్లు, చిరంజీవి, చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, రష్మిక మందన్నా రూ.10 లక్షలు, నిర్మాత నాగవంశీ రూ. 5 లక్షలు, సెలబ్రిటీలు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేశారు. అలనాటి హీరోయిన్లు మీనా, కుష్బూ, సుహాసిని, మరికొంతమంది సినీతారలు నేరుగా వెళ్లి కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రికి అందజేశారు.