తిరుమల : కార్తిక మాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా ఆదివారం శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. తిరుమల (Tirumala) లోని కల్యాణవేదిక వద్ద ఉద్యానవన విభాగంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ (Ttd) ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం శ్రీదేవి (Sridevi), భూదేవి (Bhudevi) సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించినట్లు చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు.
తమిళనాడు నుంచి నాలుగు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రెండు టన్నులు మొత్తం 8 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీజీవో నందకిషోర్, పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.