అమరావతి : ఏపీలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయవాడలో వరదలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్సీ, మండలి శాసనసభాపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) ఆరోపించారు. భారీ వర్షాలు కురుస్తాయని, ఫలితంగా వరద (Floods) వస్తుందని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు.
వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఆలోచన చేయలేదని ఆరోపించారు. ప్రతి ఆరోపణల వెనుక గత ప్రభుత్వమే కారణమంటూ తప్పించుకుంటుందని విమర్శించారు. గతంలో ఏపీలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి సహాయ చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు.
నేడు ప్రభుత్వ నిర్ణయం వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో కృష్ణనదికి రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల విజయవాడకు పెను ముప్పుతప్పిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు సత్వరమే సహాయం అందించాలని సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితులకు అండగా నిలువాలని కోరారు. ప్రజా అవసరాలను గుర్తించడంలో ప్రభుత్వానికి ఆలోచన ఉండాలని అన్నారు.