కోనసీమ జిల్లా: ఎస్ యానాం వద్ద సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ పడవలో పది మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తించారు. తమను రక్షించమంటూ వారు ఆర్తనాధాలు చేశారు. మత్స్యకారులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారులు మొదలుపెట్టి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఉప్పలగుప్తం మండలం పరిధిలోని ఎస్ యానాం వద్ద సముద్రంలో మత్స్యకారులు వెళ్తున్న బోటు బోల్తాకొట్టింది. ఈ బోటులో కాకినాడకు చెందిన పది మంది మత్స్యకారులు ఉన్నారు. రక్షించాలంటూ చేసిన ఆర్తనాదాలను అటుగా ఆఫ్‌షోర్‌లో ఉన్న రిగ్గువద్దకు వెళ్తున్న హెలికాప్టర్‌లోని సిబ్బంది గమనించారు. మత్స్యకారులు ఆపదలో ఉన్న విషయాన్ని మెరైన్ పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలెట్టారు. ఎస్ యానాంలోని ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌ను తెప్పించారు. దాని సాయంతో రెస్క్యూ సిబ్బంది సముద్రంలోకి వెళ్లి మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
వర్షాలు కురుస్తున్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోనసీమ జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కువగా వాన కురిస్తున్న సమయంలో సముద్రంలోకి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని వారు చెప్తున్నారు. సముద్రంలోకి వెళ్లేప్పుడు లైఫ్ జాకెట్లను బోట్లోలో అందుబాటులో ఉంచుకోవాలని పోలీసులు సూచనలు చేస్తున్నా.. మత్స్యకారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేకపోయాయి.