అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet ) తొలి సమావేశం ఈనెల 24న జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) అధ్యక్షతన జరుగనుంది. మంత్రులుగా ప్రమాణం చేసిన తరువాత 15 రోజుల తరువాత మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ముఖ్యంగా టీడీపీ(TDP), జనసేన (Janasena) తరుఫున ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరుగనుంది. ఆరుగ్యారెంటీలు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలు, ప్రధాన శాఖలపై శ్వేతపత్రం విడుదల తదితర అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఈనెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడడం, కూటమి భారీ విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయడం, డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్‌తో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీ్కారం చేసిన విషయం తెలిసిందే. మంత్రులందరూ కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరణ కూడా పూర్తయింది.
ఇప్పటికే కేబినెట్ సమావేశం తేదిని ఖరారు చేసినందున ఆయా శాఖల అధికారులు శాఖల పనితీరును తెలియజేస్తూ నివేదికలను ఆదివారం సాయంత్రంలోగా పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఈనెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అధికారికంగా పర్యటించనున్నారు.